IND vs ENG 5th Test Prediction: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఆరంభం కానుంది. స్వదేశంలో వరుసగా 17వ టెస్టు సిరీస్ గెలిచి జోరుమీదున్న భారత్.. గెలుపుతో ఈ సిరీస్‌ను 4-1తో ముగించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను 2-3తో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లను భారత్ 4-0, 3-1తో గెలుచుకుంది. ఈసారి మొదటి టెస్టులో ఓడినా.. పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి చేరేగాలని చూస్తున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పరుగులు చేస్తున్నారు. రజత్ పటీదార్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 63 పరుగులే చేసిన అతడికి ఇదే చివరి అవకాశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవ్‌దత్‌కు టెస్టు అరంగేట్ర అవకాశాలు తక్కువే. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్ ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టాలని చూస్తున్నారు.
భారత్ ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశాలు ఉన్నాయి. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి వస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ పేస్ కోటాలో ఆడనున్నారు. మూడో పేసర్‌ను తీసుకుంటే.. కుల్దీప్‌పై వేటు పడుతుంది. స్పిన్నర్లుగా ఆర్ అశ్విన్, ఆర్ జడేజా ఉంటారు. తన వందో టెస్టులో అశ్విన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌కు మంచి విజయం అందించాలని రోహిత్ సేన చూస్తోంది.
బజ్‌బాల్ అంటూ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఓడిపోయింది. క్రాలీ, డకెట్ నిలకడ కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో శతకంతో ఆదుకున్న రూట్‌పై ఆశలు పెట్టుకుంది. వందో టెస్టు ఆడబోతున్న బెయిర్‌స్టో వైఫల్యాల నుంచి బయటపడి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం రాబిన్సన్ స్థానంతో వుడ్‌ను తీసుకుంది. అండర్సన్ భారత బ్యాటర్లపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించనున్నాడు. షోయబ్ బషీర్, టామ్ హార్ట్‌లీ స్పిన్‌తో పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. టెస్ట్ సిరీస్‌ను విజయంతో ముగించి స్వదేశం వెళ్లాలనుకుంటోంది ఇంగ్లండ్.
Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్/కుల్దీప్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, ఫోక్స్, హార్ట్‌లీ, మార్క్‌వుడ్, షోయబ్‌్ బషీర్, అండర్సన్.