NTV Telugu Site icon

Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్‌

Sarfaraz Khan Rohit

Sarfaraz Khan Rohit

Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. 62 పరుగులు చేసిన అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ రనౌట్‌ అవ్వగానే అభిమానులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ రనౌట్‌పై ఇప్పటికే జడేజా స్పందించగా.. సర్ఫరాజ్ కూడా స్పందించాడు.

‘మా మధ్య అవగాహన లోపించింది. క్రికెట్‌ ఆటలో ఇలాంటివి అన్ని సహజమే. ఎవరో ఒకరు రనౌట్‌ అవుతుంటారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు రవీంద్ర జడేజా మద్దతుగా నిలిచాడు. సూచనలు ఇస్తూ నన్ను నడిపించాడు. లంచ్‌ సమయంలోనూ జడ్డుతో మాట్లాడా. బ్యాటింగ్‌ గురించి మేం చర్చించుకున్నాం. అరంగేట్రం చేసిన బ్యాటర్‌ ఎలాంటి ఒత్తిడికి గురి అవుతాడో జడేజా అనుభవించిందే. ఈ మ్యాచ్‌లో తొలిసారి స్వీప్ షాట్‌కు ఆడేందుకు యత్నించి విఫలమయ్యా. అప్పుడు జడేజా నా దగ్గరకు వచ్చి.. కాస్త సమయం తీసుకోమన్నాడు. జడేజా సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించా’ అని సర్ఫరాజ్ ఖాన్‌ తెలిపాడు.

Also Read: Farmers Protest 2024: సానుకూలంగానే చర్చలు.. రైతు సంఘాలతో ఆదివారం మరోసారి సమావేశం!

భారత స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు రవీంద్ర జడేజా (99), సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన బంతిని జడేజా షాట్‌ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. మార్క్ వుడ్ బంతిని అందుకోవడంతో.. వెంటనే జడేజా వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్‌ దాటేసిన సర్ఫరాజ్‌.. తిరిగి క్రీజులోకి వచ్చే లోపే వుడ్‌ వికెట్లను గిరాటేశాడు. దీంతో సర్ఫరాజ్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.