NTV Telugu Site icon

IND vs BAN: అశ్విన్‌ గురించి ఏం చెప్పాలి.. ప్రతిసారీ అతడివైపే చూస్తాం: రోహిత్

Rohit Sharma Interview

Rohit Sharma Interview

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్‌ గురించి తాను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదన్నాడు. వికెట్స్ అవసరమైన ప్రతిసారీ అతడివైపే చూస్తాం అని చెప్పాడు. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు ఎల్లప్పుడూ యాష్ సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. టీఎన్‌పీఎల్‌లో అశ్విన్ బ్యాటింగ్‌ చేయడం తాము చాలాసార్లు గమనించాం అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో యాష్ సెంచరీ (113)తో పాటు ఆరు వికెట్స్ పడగొట్టాడు.

‘ఆర్ అశ్విన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. నా తర్వాత అతడే మాట్లాడుతాడు. అన్నింటికి సమాధానం చెప్పేందుకు అతడే సరైన వ్యక్తి. మేం అతని వైపు చూసే ప్రతిసారీ.. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. అశ్విన్ గురించి చెప్పి తక్కువ చేయలేము. జట్టు కోసం అతడు చాలా చేశాడు. అతడు అద్భుతం. బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. టీమిండియాకు ఆడనప్పుడూ స్థానికంగా జరిగే తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అశ్విన్‌ ఆడాడు. అది కూడా కలిసొచ్చే అంశమే. టీఎన్‌పీఎల్‌లో చాలాసార్లు యాష్ బ్యాటింగ్‌ చేయడం మేం గమనించాం’ అని రోహిత్ శర్మ అన్నాడు.

Also Read: Anasuya Bharadwaj: వామ్మో అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘టెస్టుల్లో చాలా రోజుల తర్వాత అద్భుత విజయం సాధించాం. చాన్నాళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడినా.. క్రికెట్‌ నుంచి బయటకు వెళ్లలేదు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాం. వారం ముందే ఇక్కడికి వచ్చాం. అనుకున్నట్లుగానే మంచి ఫలితం రాబట్టాం. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించారు. రిషబ్ పంత్ టెస్టుల్లోకి అడుగు పెట్టి దాదాపు 20 నెలలు అయింది. ఐపీఎల్, ప్రపంచకప్‌లో ఆడినప్పటికీ దులీప్ ట్రోఫీలో ఆడడం ఉపయోగపడింది. గిల్‌ మళ్లీ టెస్టుల్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. జడేజా బాగా ఆడాడు. మేం భారత్‌లో ఆడినా, వెలుపల ఆడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకు పోరాడతాం. జట్టును అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నాం’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.