Site icon NTV Telugu

IND vs BAN: జస్ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. ఎవరికీ వెసులుబాటు లేదు!

Jasprit Bumrah

Jasprit Bumrah

ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో బంగ్లా మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతిని ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఆసియా కప్‌ 2025లోని మిగతా మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని టీమిండియా సహాయక కోచ్ రైన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. అంతేకాదు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆడుతాడని తెలిపాడు.

‘పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌తో పాయింట్ల టేబుల్‌ ఎలా ఉంటుందో మేం ఓ అంచనాకు వచ్చాం. ఓ మ్యాచ్ ఉండగానే ఫైనల్‌కు చేరుకోవాలని భావిస్తున్నాం. చివరి మ్యాచ్‌లో అవకాశం తీసుకోకూడదని అనుకుంటున్నాము. తుది జట్టు ఎంపికలో ఎవరికీ ఎలాంటి వెసులుబాటు లేదు. జస్ప్రీత్ బుమ్రాకూ విశ్రాంతిని ఇవ్వము. వచ్చే వారంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్ విషయంలో మేం జాగ్రత్తగానే ఉన్నాం. ఆసియా కప్ 2025లో అత్యుత్తమ జట్టునే బరిలోకి దింపుతాం’ అని రైన్ టెన్ డస్కటే తెలిపాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారని, బుమ్రా బంగ్లాదేశ్‌పై ఆడడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకి డస్కటే పులిస్టాప్ పెట్టాడు.

భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

 

Exit mobile version