What is Diamond Duck in Cricket: క్రికెట్‌లో దాదాపుగా అన్ని పదాలు అభిమానులకు సుపరిచతమే. వైడ్, నో బాల్, ఎల్బీ, డీఆర్ఎస్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, డకౌట్, గోల్డెన్ డక్.. వంటివి అందరికి తెలుసు. అయితే ‘డైమండ్ డక్’ అంటే మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. విశాఖ పట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఇంతకు ఈ డైమండ్ డక్ అంటే ఏంటి? అని కొందరు గూగుల్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ వివరణ.
‘డకౌట్’ అంటే ఓ బ్యాటర్ ఎన్ని బంతులు ఆడినా.. పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరడం. ‘గోల్డెన్ డక్’ అంటే ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటవ్వడం. ‘డైమండ్ డక్’ అంటే.. ఓ బ్యాటర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరడం. వైజాగ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అలానే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి యశస్వీ జైస్వాల్ షాట్ ఆడగా.. రెండో పరుగుకు ప్రయత్నించి రుతురాజ్ రనౌట్ అయ్యాడు.
టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రుతురాజ్ కంటే ముందు జస్ప్రీత్ బుమ్రా (2016), అమిత్ మిశ్రా (2017)లు ఉన్నారు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా 208 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.