NTV Telugu Site icon

Jasprit Bumrah: 10 ఏళ్ల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌!

Bumrah Steve Smith

Bumrah Steve Smith

టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌, స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డ‌కౌట్‌ చేసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్‌ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్‌ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.

అంతకుముందు స్టీవ్ స్మిత్‌ను దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. 2014లో గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్మిత్ రెండోసారి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. పెర్త్ మ్యాచ్‌లో బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. నాథ‌న్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్‌, ఉస్మాన్ ఖావాజా, ప్యాట్ క‌మ్మిన్స్‌ను అవుట్ చేశాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 17 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్‌ రెడ్డి

పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై డీలా పడ్డ భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా తన సంచలన బౌలింగ్‌తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్‌గా మరింత బాధ్యతలో బౌలింగ్‌ చేసిన అతడు తొలి రోజు చివరికి జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. ఆసీస్‌ బ్యాటర్లు ఎంత సన్నద్ధమై వచ్చినా.. బుమ్రా పేస్‌ ముందు తలొంచక తప్పలేదు. తొలి రోజు ఆట చివరికి ఆసీస్ 67/7తో నిలిచింది. అంతకుముందు భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది.