Yuvraj Singh Picks Rohit Sharma For India T20 World Cup 2024 Captaincy: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారిఆ విషయం తెలిసిందే. అంతేకాదు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ కూడా అందుకున్నాడు. దీంతో ముంబైని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్.. వచ్చే సీజన్‌లో హార్దిక్ సారథ్యంలో ఆడాలి. ఈ నేపథ్యంలో రోహిత్-హార్దిక్ మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఆడినప్పుడు తప్పకుండా ఇగో సమస్యలు వస్తాయని, ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చర్చించుకోవాలన్నాడు.
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా టెలిగ్రాఫ్‌తో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఆడినప్పుడు ఇగో సమస్యలు వస్తాయి. వారికి ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవాలి. రోహిత్-హార్దిక్ మధ్య అలాంటి సమస్య ఉన్నట్లు నాకు మాత్రం కనిపించడం లేదు. హార్దిక్ ముంబై జట్టుకు ఆడినప్పుడు అతడి నుంచి ఉత్తమ ప్రదర్శన వెలికితీసేందుకు.. రోహిత్ కీలక ప్రాత పోషించాడు. గుజరాత్ జట్టుకు ఆడినప్పుడు హార్దిక్ నాలుగో స్థానంలో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు’ అని యువరాజ్ అన్నాడు.
Also Read: IND vs AFG: మరో 35 పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ!
టీ20 ప్రపంచకప్ 2024లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడా? ప్రశ్నకు యువరాజ్ సింగ్ సమాధానం ఇచ్చాడు. ‘భారత జట్టుకు చాలా మంచి కెప్టెన్ కావాలి. మైదానంలో అప్పటికప్పుడే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి, తప్పు జరిగితే జట్టును తిరిగి గాడిలోకి తీసుకురాగల వ్యక్తి అవసరం. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించాడు. భారత జట్టును వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. ఐపీఎల్, టీమిండియాకు లభించిన గొప్ప కెప్టెన్లలో ఒకడు. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి నాకు తెలియదు. అది సెలక్టర్ల నిర్ణయం’ అని యువీ పేర్కొన్నాడు.