NTV Telugu Site icon

IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్‌!

Virat Kohli Golden Duck

Virat Kohli Golden Duck

Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ వేసిన మూడో ఓవర్‌ నాలుగో బంతికి పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్‌ డక్‌ నమోదు చేశాడు. టీ20 ఇన్నింగ్స్‌లో ఎటువంటి పరుగులు చేయకపోవడం ఇది ఐదవసారి మాత్రమే.

టీ20 ప్రపంచకప్‌ 2024కు ముందు భారత్ ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. దాదాపుగా 14 నెలల అనంతరం విరాట్ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ.. రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే బెంగళూరులో జరిగిన మూడో టీ20లో మాత్రం విఫలమయ్యాడు. విరాట్ బ్యాటింగ్‌ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. రన్ మెషిన్ అవుట్‌ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.

Also Read: Rohit Sharma: టీ20ల్లో తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు!

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్‌ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ చిత్తుచేసింది. భారత్, అఫ్గాన్ జట్లు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై కాగా.. తొలి సూపర్‌ ఓవర్‌ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. ఇక రెండో సూపర్‌ ఓవర్‌లో ముందుగా భారత్‌ 11 రన్స్ చేయగా.. అఫ్గాన్‌ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.