India Playing 11 vs South Africa in ODI World Cup 2023: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలని చూస్తున్న భారత్.. తదుపరి జరిగే మ్యాచ్‌లో పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. భారీ విజయాలతో దూసుకెళుతున్న దక్షిణాఫ్రికాను ఓడించడం రోహిత్ సేనకు అంత సులువేం కాదు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో భారత్ తుది జట్టులో ఎవరుంటారో ఓసారి చూద్దాం. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే అంశం. పేలవ ఫామ్‌తో పరుగులు చేయలేకపోయిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానంలో ఆడుతాడు. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.
బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ భారత్ సత్తాచాటుతోంది. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వికెట్స్ పడగొడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్ సెమీస్ చేరినా.. తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ బౌలర్లకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే.. ఆర్ అశ్విన్ లేదా శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. కోల్‌కతా పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. సిరాజ్ స్థానంలో అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు.
Also Read: Hardik Pandya Ruled Out: టీమిండియాకు భారీ షాక్.. ప్రపంచకప్ 2023 నుంచి హార్దిక్ పాండ్యా ఔట్!
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆర్ అశ్విన్.