Increments in India: లేచింది మొదలు.. పడుకునే వరకు.. లేఆఫ్ వార్తలతో నీరసించిపోతున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఒక శుభవార్త. ఈ ఏడాది శాలరీలు పది శాతానికి పైగానే పెరగనున్నాయి. 46 శాతం సంస్థలు ఈ సంవత్సరం.. ఉద్యోగుల వేతనాలను రెండంకెల శాతం పెంచాలని భావిస్తున్నాయి. కనీసం 10 పాయింట్ 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాయి.
read more: Indian Companies Q3 Earnings: విశ్లేషకులు చెప్పినదానికన్నా మంచి ఫలితాలు
టెక్నాలజీ రంగంలో 12 పాయింట్ 9 శాతం, ఇ-కామర్స్ సెక్టార్‌లో 12 పాయింట్ 2 శాతం హైక్స్ ఇవ్వనున్నాయి. ఆర్థిక సంస్థలు, ఎఫ్‌ఎంసీజీ (లేదా) ఎఫ్‌ఎంసీడీ కంపెనీలు సైతం తక్కువలో తక్కువగా 10 శాతం వేతనం పెంచాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. 2023లో వ్యాపార వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందని 75 శాతం సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ విషయాలను ఏయాన్ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది.
ఈ అధ్యయనంలో భాగంగా 40కి పైగా ఇండస్ట్రీలకు చెందిన 14 వందల కంపెనీల సమాచారాన్ని విశ్లేషించింది. ఇదిలాఉండగా.. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఇంక్రిమెంట్లు అత్యధికంగా పెరగనున్నాయి. మన దేశం తర్వాత.. బ్రెజిల్‌లో 7.2 శాతం, చైనాలో 6.3, అమెరికాలో 5.2, బ్రిటన్‌లో 4.8 శాతం చొప్పున వేతనాలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక మందగమన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ట్యాలెంట్ కలిగిన ఉద్యోగుల కోసం, మంచి పనితీరు కనబరిచేవారి కోసం సంస్థలు డబ్బు ఖర్చు పెట్టేందుకు వెనకాడబోవని ఈ సర్వే తేల్చిచెబుతున్నట్లు ఏయాన్ సంస్థ డైరెక్టర్ ప్రితీష్ గాంధీ పేర్కొన్నారు.