Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. అంతేకాకుండా.. 42 లక్షల మందిలో 2వేల29 మంది విద్యార్థుల లెక్కలు తేలడం లేదంటున్నారు.. దీనిపై ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇది సర్వేల తప్పులా అని దుయ్యబట్టారు. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 18 సంవత్సరాల లోపు పిల్లలు 60 వేల మందికి పైగా మరణించారని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అనేక మంది విద్యార్థులు చనిపోయారని సర్వేల్లో తేలిందని ఆయన తెలిపారు. రెండు లక్షల మంది విద్యార్థులు కనిపించడం లేదని తేలిందని చెప్పారు. భయంకరమైన నిజాలను ప్రభుత్వం దాస్తుందా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యత సీఎం జగన్దేనని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read Also: AP News: NTV ఎఫెక్ట్.. ఎమ్మిగనూరులో శిశువు మృతిపై విచారణ
మరోవైపు సత్యసాయి ట్రస్టు ద్వారా వస్తున్న రాగి ముద్దను ప్రభుత్వం తాను పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందని, పౌష్టికాహార లోపంతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. అమ్మ ఒడి కోసం 19,400 కోట్లు ఖర్చు పెట్టారని.. విద్యాదీవెన, వసతి దీవెన అని గొప్పలు చెబుతున్నారని నాదెండ్ల విమర్శించారు. ఇదిలా ఉంటే.. తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా స్కూళ్లలో పర్యటిస్తే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. మరి ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అంతేకాకుండా.. ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఒక తరం నష్టపోయిందని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.