YS Jagan: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భూముల రీ సర్వే అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమండలంపై ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
భూముల రీ సర్వే చేయాలన్న కనీస ఆలోచనైనా చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు తీర్చాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదని వ్యాఖ్యానించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలకు ఏకైక పరిష్కారం సమగ్ర భూ రీ సర్వేనేనని స్పష్టం చేశారు. 2019కు ముందు భూములు సర్వే చేయడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీనే లేదని, తన పాదయాత్ర సమయంలోనే భూముల రీ సర్వే చేయాలన్న నిర్ణయం తీసుకున్నానని జగన్ అన్నారు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేపడతామని హామీ ఇచ్చామని, ఆ మాటకు కట్టుబడి పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహించామని జగన్ అన్నారు. రైతులకు, భూ యజమానులకు వివాదాలు లేకుండా, ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా శాశ్వత భూ పత్రాలు అందించామని తెలిపారు. భూ సర్వేను ఒక మహాయజ్ఞంలా చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిషర్ల కాలంలో దాదాపు వందేళ్ల క్రితం జరిగిన భూ సర్వే తర్వాత మళ్లీ 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించామని జగన్ గుర్తుచేశారు.
Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్టాఫ్ లాక్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసిన రెహమాన్
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా? అని ప్రశ్నించారు. క్రయవిక్రయాలు జరిగినా, కుటుంబాల మధ్య భూ పంపకాలు జరిగినా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యవస్థను రూపొందించామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం దేశంలోనే ఒక రికార్డని.. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించడం, ఒక్క నోటిఫికేషన్‌తోనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలేనన్నారు. యూరప్, అమెరికాలో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీతో భూముల రీ సర్వే నిర్వహించామని, గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు జరిగేలా వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ ప్రెస్ మీట్ లో అన్నారు.