ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నువాపా జిల్లా దేవ్‌ధార గ్రామ సమీపంలో జరిగింది.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
అటవీశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పుస్తం చిందా(58), హృషికేష్ చిందా(40)లు ఈనెల 16న అడవి పందులను పట్టుకునేందుకు అడవిలో ఉచ్చు వేశారు. దురదృష్టవశాత్తు, ఒక చిరుతపులి ఆ వలలో చిక్కుకుంది. చిరుతపులిని చంపి చర్మం ఒలిచి మాంసాన్ని వండుకుని తిన్నారనేది ఆరోపణ. రహస్య సమాచారం ఆధారంగా.. అటవీ శాఖ బృందం వారి ఇళ్లపై దాడి చేసి చిరుతపులి చర్మం, తల, కొంత వండిన మాంసాన్ని సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకుంది. ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే మరో ఇద్దరు సహచరులు పరారీ అయ్యారు.
READ MORE: Koti Deepotsavam 2024 Day 12: ఘనంగా వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వర ఆది దంపతుల కల్యాణోత్సవం
ఈ ఘటనపై ఖరియార్ టెరిటోరియల్ డివిజన్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF), MD ముస్తఫా సలేహా మాట్లాడుతూ.. “ఈ కేసు వన్యప్రాణుల సంరక్షణకు వ్యతిరేకంగా జరిగిన తీవ్రమైన నేరాన్ని సూచిస్తుంది. క్రూర జంతువుల జాబితాలో ఉన్న చిరుతను చంపి తినడం గతంలో ఎన్నడూ చూడలేదు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను కోర్టులో హాజరు పరుస్తాం.” అని తెలిపారు. కాగా.. వన్యప్రాణుల నేరాలపై ఎలాంటి ఉపశమనమూ ఉండదని అటవీశాఖ హెచ్చరించింది. అలాగే, ఇలాంటి నేరాల గురించి వెంటనే డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయాలని సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటన వన్యప్రాణుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, పరిరక్షణ కోసం పరిపాలన, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.