Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఎక్కడా భారీ వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ మేఘావృత వాతావరణమే కనిపించినా, వర్షాలు పెద్దగా ఉండే సూచనలు లేవు. ఒక్క విశాఖపట్నంలో మాత్రం మధ్యాహ్నం తరువాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో రాత్రి 10 గంటల వరకు కొన్ని చోట్ల జల్లులు పడొచ్చని అంచనా. అయినప్పటికీ, రాష్ట్రం మొత్తంగా చూసినప్పుడు పొడి వాతావరణమే కొనసాగుతోంది. ఇదే సమయంలో కర్ణాటక, కేరళల్లో మాత్రం భారీగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ 24 గంటల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Telangana Police : నేరగాళ్లకు నో ఎస్కేప్.. అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్‌ను ట్రాక్
అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలుల వేగం గణనీయంగా పెరిగింది. అక్కడ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచుతున్నాయి. ఈ గాలుల ప్రభావం కర్ణాటక, ఏపీ, తెలంగాణల మీద పడుతున్నప్పటికీ, బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు మాత్రం ఈ రాష్ట్రాలను తాకడం లేదు. తెలంగాణలో గాలి వేగం సగటున 18 కిలోమీటర్లుగా, ఏపీలో 21 కిలోమీటర్లుగా నమోదవుతోంది.
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, తెలంగాణలో 33 నుండి 34 డిగ్రీల సెల్సియస్, ఆంధ్రప్రదేశ్‌లో 33 నుండి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. తూర్పు రాయలసీమలో వేడి కాస్త ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ గాలుల ప్రభావం వల్ల ఉక్కపోతగా మాత్రం అనిపించకపోవచ్చు. తేమ శాతం చూస్తే, పగటివేళ తెలంగాణలో 63 శాతం, ఏపీలో 48 శాతం ఉండగా, రాత్రివేళ తెలంగాణలో 75 శాతం, ఏపీలో 66 శాతం ఉంది.
సాధారణంగా ఈ సమయంలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురవాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ ఈసారి అంచనాలకు విరుద్ధంగా వర్షాలు పెద్దగా కురవడం లేదు. మే నెలలో వచ్చిన వాయుగుండం కారణంగా రుతుపవనాలు ఈశాన్య భారతదేశం వైపు సరిచేయబడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఎక్కువగా ఉన్నా వర్షాలు కురవడం లేదు. ఈ పరిణామం రైతులను మరింత ఆందోళనలోకి నెట్టింది. వాతావరణ శాఖ అంచనాలు సరిగ్గా పని చేయకపోవడం, గతంలో కురిసిన వానలకంటే జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉండటం రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశాల్లో వర్షాలు కురుస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో వర్షం లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. వాతావరణ శాఖ అంచనాలు నిలబెట్టుకోలేకపోతున్న నేపథ్యంలో, ప్రజలు, ముఖ్యంగా రైతులు మళ్లీ మంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.