NTV Telugu Site icon

Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణం: జిల్లా ఫైర్ అధికారి

Fire Accident

Fire Accident

Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతి లేదన్నారు. క్రాకర్స్ దుకాణాలు ఓపెన్ ప్లేస్‌లో ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. సుల్తాన్ బజార్, యాకత్‌పురాలో జరిగిన రెండు ప్రమాదాలకు అక్రమ నిల్వలే కారణమన్నారు. సుల్తాన్‌బజార్ ప్రమాదంలో లైసెన్స్ ఒక దగ్గర తీసుకొని మరో దగ్గర అమ్మకాలు జరిపారన్నారు. ప్రమాదం జరిగిన తరువాతే ఈ విషయం తెలిసిందన్నారు. అందుకే ఆ షాప్ లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. యాకత్‌పురా ప్రమాదంలో పటాకులు అక్రమంగా నిల్వ ఉంచుకోవడమే కారణమని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు, కేసులు నమోదు చేశామన్నారు.

Read Also: Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం

నిబంధనలు పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్‌తో జాగ్రత్త వహించాలన్నారు. అందరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు పాటించక పొవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాణా సంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలి, చెప్పులు వేసుకోవాలి,ఓపెన్ ప్లేస్‌లో కాల్చాలి, బకెట్ వాటర్ పెట్టుకోవాలి, కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి, అవసరమైతే చేతులకు గ్లౌస్ వేసుకోవాలని అని సూచనలు చేశారు. పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే బాణసంచా కాల్చాలని సూచించారు.