Janasena and TDP: టీడీపీ, జనసేన పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పొత్తు పొడవకముందే చిక్కులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జనసేనలో కీలక అభ్యర్థులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ టికెట్ ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ కోసం ఇరు పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారు తామే బరిలో నిలవబోతున్నామని కార్యకర్తల వద్ద చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
టీడీపీ, జనసేన పొత్తు ఊసెత్తగానే అందరి చూపు ఆంధ్రా ప్యారిస్ తెనాలిపై పడుతుంది. జనసేనలో నెంబర్ టూ లీడర్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై గెల్చిన నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌గా పనిచేశారు. తెనాలి తనకు పట్టున్న నియోజకవర్గం కావడంతో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నాదెండ్ల మనోహర్ తెనాలి జనసేన టికెట్ దక్కించుకోవడం పెద్ద విషయం కాదు. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఆలపాటి రాజాకు టికెట్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అటు ఆలపాటి కూడా తెనాలి నుంచి పోటీకి తగ్గేదేలే అంటూ ముందడుగు వేస్తున్నారు.
తెనాలి రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది మనోహర్ లక్ష్యమైతే, ఆలపాటి రాజా ఇప్పటికే ప్రజల మధ్య తిరుగుతున్నారు. మరి ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే బరిలోకి దిగేది ఎవరు? టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే నాదెండ్ల, ఆలపాటిలో ఒకరు టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. అదే జరిగితే క్షేత్రస్థాయిలో ఒకరు ఇంకొకరికి సహకరిస్తారా? లేకపోతే పార్టీ ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేకంగా పనిచేస్తారా? ఇదే ఇప్పుడు తెనాలిలోనే, ఏపీలోనూ హాట్‌టాపిక్‌గా మారుతోంది.