NTV Telugu Site icon

ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సస్పెండ్‌!

Srilanka

Srilanka

Sri Lanka Cricket suspended by ICC: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఎస్‌ఎల్‌సీ పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంక బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని, సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు సంబంధించిన షరతులను ఐసీసీ నిర్ణీత సమయంలో నిర్ణయిస్తుందని పేర్కొంది. నవంబర్ 21న ఐసీసీ సమావేశమవుతుందని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.

Also Read: Virat Kohli: మంచి బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది: కోహ్లీ

జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ 2024కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో అండర్‌-19 ప్రపంచకప్‌ నిర్వహణ విషయంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రపంచకప్ 2023లో శ్రీలంక దారుణంగా విఫలమైంది. 9 లీగ్ మ్యాచ్‌లకు 2 మాత్రమే గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌పై విజయం సాధించిన శ్రీలంక.. మిగతా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.