ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. గత మూడు రోజులు విచారణలో రవి పెద్దగా నోరు మెదపకపోయినా, నిన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా విచారణ చేసి కీలక సమాచారం బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రవి ఉపయోగించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ, వాటిని ఇండియా నుంచే యాక్సెస్ చేస్తున్నట్లు గుర్తించారు. పైరసీ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ పెంచాయి. ముఖ్యంగా ప్రముఖ OTTలు ఇచ్చిన ఫిర్యాదుల వల్ల కేసు మరింత వేగం అందుకుంది. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు పంపగా, తెలంగాణ సైబర్‌క్రైమ్ టీం డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా కీలక ఆధారాలను సేకరించడానికి ప్రయత్నిస్తోంది.
Also Read : Dude Movie: ‘డ్యూడ్’ మూవీపై ఇన్‌ఫ్లూయెన్సర్ విమర్శ.. దర్శకుడి కౌంటర్ రిప్లై
వీడియోలు అప్‌లోడ్ చేసే టీంను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా పైరసీ వల్ల వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ రెవెన్యూ ఎవరికి చేరుతోంది? మాల్వేర్ సైట్లతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో ప్రత్యేక విచారణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 355 పైరసీ సైట్లపై కంట్రోల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కేసు లోతు దృష్ట్యా కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉంది. నేటి నాలుగో రోజు విచారణలో రవి వద్ద నుంచి పలు కీలక వివరాలు బయటకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.