Rahul Dravid Wants Equal Reward to Support Staff: 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి అందించింది. ఇక హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్‌కూ రూ.5 కోట్ల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల నజరానా దక్కింది. అయితే ద్రవిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రాహుల్ ద్రవిడ్ తన బోనస్‌ను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌తో సమానంగానే తాను బోనస్‌ను పంచుకోవాలనుకుంటున్నాడట. రూ.5 కోట్లకు బదులుగా.. రూ.2.5 కోట్ల బోనస్‌ను అందించాలని బీసీసీఐని రాహుల్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘రాహుల్ ద్రవిడ్ తన సహాయ కోచింగ్ స్టాఫ్‌తో సమానంగానే బోనస్‌ను తీసుకోవాలనుకుంటుంన్నాడు. బోనస్‌గా ఆయనకు రూ.5 కోట్లు వచ్చాయి. కానీ ఇతర కోచ్‌లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ ప్రకటించింది. తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. కోచింగ్ స్టాఫ్‌తో పాటు తనకూ రూ.2.5 కోట్ల బోనస్‌ను ఇవ్వాలని కోరాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి.
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచినప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్‌కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున అందించింది. ద్రవిడ్ మాత్రం అందరితో పాటు తనకూ సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను రివైజ్ చేసిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్‌కు రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు కూడా బీసీసీఐ అలానే చేసే అవకాశాలు ఉన్నాయి.