Ioniq 5 is Hyundai’s 100 Millionth Car: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్’ అరుదైన మైలురాయిని అందుకుంది. సోమవారం గ్లోబల్ క్యుములేటివ్ ప్రొడక్షన్‌లో 100 మిలియన్ (10 కోట్ల) యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కంపెనీ స్థాపించిన 57 సంవత్సరాలలో ఈ ఘనతను సాధించింది. అయోనిక్ 5 మోడల్ తొలి కారును 10 కోట్ల వాహనంగా దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో ఓ కస్టమర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఉల్సాన్ ప్లాంట్‌లో హ్యుందాయ్ భారీ వేడుకను నిర్వహించింది.
ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ వాహనాల ఉత్పత్తి 100 మిలియన్ల మార్కును దాటడం చెప్పుకోదగ్గ విషయం అని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో జేహూన్ ఛాంగ్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా మా వాహనాల ఉత్పత్తి 100 మిలియన్ల మార్కును దాటడం ఆనందంగా ఉంది. ఇది మా కస్టమర్ల మద్దతుతోనే సాధ్యమైంది. హ్యుందాయ్ మోటార్స్‌కు వారు మద్దతుగా నిలిచారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సృజనాత్మకతను కొనసాగించడం మా వృద్ధికి కారణంగా నిలిచింది’ అని చెప్పారు. ‘100 మిలియన్ల మైలురాయిని చేరడానికి హ్యుందాయ్ మోటార్స్‌లోని ప్రతీ ఉద్యోగి శ్రమించారు. మా సంస్థ విద్యుత్తు కార్లలో ముందుకువెళ్లడానికి ఇది తొలి మెట్టు’ అని కంపెనీ దేశీయ విక్రయ విభాగం అధిపతి డాంగ్ సీక్ పేర్కొన్నారు.
1968లో ఉల్సాన్ ప్లాంట్‌లో హ్యుందాయ్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. కొరియన్ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి జన్మస్థలంగా ఈ ప్లాంట్‌ను భావిస్తారు. కొరియాలో భారీగా ఉత్పత్తి చేసిన ది పోనీ కారును 1975లో ఇక్కడే తయారు చేశారు. ప్రస్తుతం ఉల్సాన్ ప్లాంట్ విద్యుత్తకార్ల (ఈవీ) తయారీ హబ్‌గా నిలిచింది. ఇందుకోసం ప్రత్యేక ప్లాంట్‌నే హ్యుందాయ్ ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తుర్కియే, భారత్, అమెరికా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో హ్యుందాయ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
Also Read: Kanpur Test: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటలో మార్పులు!
1967 నుండి 2024 ఆగస్టు వరకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవంటే ఉంది. ఇవి 15.37 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. యాక్సెంట్ 10.25 మిలియన్ యూనిట్లు, సొనాటా 9.48 మిలియన్ యూనిట్లు, టక్సన్ 9.36 మిలియన్ యూనిట్లు, టక్సన్ శాంటా ఫే 5.95 మిలియన్ యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా కారు భారత్ ఆటో మార్కెట్‌ను శాసిస్తోంది.