Hyundai Creta: ఆటోమొబైల్ రంగంలో తీవ్రమైన పోటీ ఉన్నా.. తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కారణంగా హ్యుందాయ్ ఇండియా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇకపోతే, 2015లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి క్రెటా భారతీయ వినియోగదారులకి ప్రియమైన SUVగా నిలిచింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా SUV మోడల్ క్రెటా 2025 జనవరి అమ్మకాల వివరాలను తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో దీనిని మొత్తం 18,522 యూనిట్ల అమ్మకాలను సాధించి SUV విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. 2025 జనవరి అమ్మకాలలో క్రెటా ICE వెర్షన్, క్రెటా N-లైన్, అలాగే తాజాగా విడుదలైన క్రెటా ఎలక్ట్రిక్ (EV) మోడళ్ల అమ్మకాలతో కూడిన గణాంకాలను హ్యుందాయ్ వెల్లడించింది. గత ఏడాది జనవరి సేల్స్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదవడం గమనార్హం.
Read also: Virat Kohli: జోస్ బట్లర్ వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔట్!
హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే.. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను మెరుగుపరిచే ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, BOSE 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి హైలైట్ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి 17.4 kmpl నుండి 21.8 kmpl వరకు మైలేజ్ ఇస్తుందని హ్యుందాయ్ కంపెనీ పేర్కొంది.
ఇక క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ తాజాగా భారతీయ మార్కెట్లో బాగా ఆదరణ పొందుతోంది. ఇది 42 Kwh, 51.4 Kwh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 390 కిమీ నుండి 473 కిమీ వరకు ప్రయాణించవచ్చు. క్రెటా EV ప్రారంభ ధర రూ.17.99 లక్షల నుంచి రూ. 24.38 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఆన్ రోడ్ ధర పన్నులు, ఇన్సూరెన్స్ వంటివి కలిపి మరింత ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి SUV మార్కెట్లో క్రెటా హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందుతూ సేల్స్ రికార్డులను తిరగరాస్తోంది. వినియోగదారులు అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కోసం క్రెటాను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు.