NTV Telugu Site icon

AV Ranganath : హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్ కీలకం.. కమిషనర్ రంగనాథ్

Hydra

Hydra

AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

గురువారం డీఆర్‌ఎఫ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక వారంపాటు శిక్షణ అందించనున్నారు. హైడ్రా సమాజంలోనే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.

CM Chandrababu: ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుంది.. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది!

ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో డీఆర్‌ఎఫ్ కీలకమైన భూమిక పోషిస్తుందని కమిషనర్ తెలిపారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా ఈ బృందానికి తోడయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఆర్‌ఎఫ్‌పై నమ్మకంతోనే కొత్త బాధ్యతలను అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా అప్పగించినట్లు వెల్లడించారు. ఈ బాధ్యతలను కట్టుదిట్టంగా, నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరముందని హితవిచ్చారు.

పోలీసు పరీక్షలో కొద్దిపాటి మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్ట్ ఆధారంగా, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా నియామకాలు జరిగాయని కమిషనర్ వివరించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరికీ లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.

భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలకు అండగా ఉండేందుకు, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ కొత్తగా నియమితులైన సభ్యులు శిక్షణ పొందుతున్నారని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

Champions Trophy 2025: పాక్ ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం..