Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలు దోమలగూడలోని ఫరీద్ బస్తీలో నివాసం ఉంటున్నాయి. అదే ప్రాంతానికి చెందిన సహిత కుమారి, స్నేహ కుమారి, లత అనే ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. విచారణలో బాలికలు మొదట హిమాయత్‌నగర్‌లో ఓ ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రెండు రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తూ వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు.

బాలికలు తమ స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు, ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ముగ్గురు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాలికలను వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.