హైదరాబాద్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న విషయం బయటపడడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ పరిధిలో నివాసం ఏర్పరుచుకుని కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం ప్రకారం… పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. బాగా చదువుకోండని, పెద్దయ్యాక పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు కలవొద్దని షరతులు కూడా విధించారు. తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని మైనర్లు.. ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలో మరోచరిత్ర సినిమా తరహాలో సహజీవనం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు.
Also Read: Shiva Deekshas: వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన శివదీక్షలు!
కొద్ది రోజులుగా ఇద్దరి కదలికలపై స్థానికులు అనుమానం కలిగింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైనర్లు ఉండే బంజారాహిల్స్ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటూ.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శిశువిహార్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. కౌన్సెలింగ్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనతో మైనర్ల భద్రత, తల్లిదండ్రుల బాధ్యతలు, సమాజంలో మారుతున్న ధోరణులపై చర్చ మొదలైంది.