Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hyderabad Saidabad Triple Talaq

Hyderabad Saidabad Triple Talaq

Hyderabad: హైదరాబాద్ సైదాబాద్‌లో ఒక భర్త తన భార్యకు ఫోన్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు కొడుకు కావాలని, కూతుళ్లు వద్దంటూ భార్యకు సందేశం పంపి విడాకులు ప్రకటించాడు. సైదాబాద్ లోకాయుక్త కాలనీకి చెందిన నిషాంత్ ఆఫ్రీన్ (37)కు, మలక్‌పేట సలీంనగర్‌కు చెందిన మహమ్మద్ అతి అర్ఫత్ (40)తో 2015 ఆగస్టులో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి, వీటికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ క్రమంలో గత నెల 24న భర్త మహమ్మద్ అతి అర్ఫత్ తన భార్యకు ఫోన్ చేసి, డిసెంబర్‌లోగా తనపై ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కేసులు వెనక్కి తీసుకోకపోతే నిన్ను వదిలేస్తానంటూ హెచ్చరించాడు. ఆ మరుసటి రోజే “నువ్వు నాకు నచ్చడం లేదు.. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు” అని పేర్కొంటూ, మూడు సార్లు తలాక్ చెబుతూ భార్యకు విడాకుల సందేశం పంపాడు. భర్తతో పాటు తన అత్త సహనా బేగం, ఆడపడుచు అరియా ప్రేరేపించడం వల్లే భర్త ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు నిషాంత్ ఆఫ్రీన్ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.