Sand Mafia: హైదరాబాద్ నగరంలో సాండ్ మాఫియా అక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఇసుక డంప్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 1,100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి మీద కఠిన చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను డెలివరీ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా నిల్వ చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. ఈ ముఠా తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఇసుకను 10,000కు కొనుగోలు చేసి, 50,000లకు విక్రయించే గ్యాంగ్ అసలు ముసుగును పోలీసులు తొలగించారు.
Read Also: IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!
హైదరాబాద్‌లో 16 ఇసుక డంప్‌లపై పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగరానికి ఇతర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాలను పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అక్రమ ఇసుక వ్యాపారులను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరించారు.