Site icon NTV Telugu

GHMC : హైదరాబాద్‌ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో MIM విజయం

Mim

Mim

GHMC : హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. అయితే, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

బీజేపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అలాంటిదేమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ విజయం హైదరాబాద్‌లోని స్థానిక సంస్థలపై ఎంఐఎం పట్టును మరోసారి రుజువు చేసింది. ఎంఐఎం శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి.

Hyderabad: నేడే హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విజయం ఎవరిది?

Exit mobile version