Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది.. హైదరాబాద్‌లో మెట్రో రైల్ పట్టాలు ఎక్కిన తర్వాత.. క్రమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెరుగు పడుతూ వస్తుంది.. ఇక, గణేష్ నిమజ్జనం మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్లింది.. అయితే, ఇప్పుడు చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది హెచ్‌ఎంఆర్.. సోమవారం రోజు ఏకంగా 5.10 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ రికార్డు సంఖ్యలు ఈ పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన మరియు అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం మరియు ఆమోదాన్ని సూచిస్తోందని హెచ్‌ఎంఆర్ పేర్కొంది.
Read Also: Etela Rajender: కార్యకర్తగా నా బాధ్యతను నిర్వహిస్తా.. బీజేపీ గెలుపుకు శ్రమిస్తా
చారిత్రాత్మకమైన మైలురాయిని అందుకున్న నేపథ్యంలో.. హెచ్‌ఎంఆర్ ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్, ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన సందర్భం, హెచ్‌ఎంఆర్‌ని తాము ఇష్టపడే ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటూ తమ సంఘీభావాన్ని చూపిన మా విలువైన ప్రయాణికులకు మేం ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అని వెల్లడించారు. ఇక, కరోనా మహమ్మారి మా వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.. కానీ, టీమ్‌ల యొక్క స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా, ఈ రోజు మనం ఈ విజయాన్ని అందుకున్నాం అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుండి నిరంతర సహకారం, లభిస్తోన్న మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, విశ్వసనీయమైన, వేగవంతమైన.. ప్రజా రవాణా వ్యవస్థను అందించడం సాధ్యమైందని పేర్కొన్నారు కేవీబీ రెడ్డి. కాగా, హైదరాబాద్‌లో మెట్రో ఎంట్రీ తర్వాత ట్రాఫిక్ తగ్గుతుందని భావించినా.. రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నా.. ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతోన్న విషయం విదితమే..