NTV Telugu Site icon

Hyderabad Mayor: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదు..

Mayor

Mayor

Hyderabad Mayor Vijayalakshmi: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌ రెడ్డితో కలిసి ఎల్‌బీ నగర్ జోన్‌లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్‌బీ నగర్ జోన్‌లో కాప్రా చెరువు, చెర్లపల్లి చెరువు, డాక్టర్ ఏఎస్ రావు నగర్ పాండ్‌ను, నాగోల్ చెరువు, బేబీ పాండ్, మన్సురాబాద్ పెద్ద చెరువు బేబీ పాండ్, సరూర్ నగర్ ట్యాంక్ బండ్‌ను పరిశీలించి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Read Also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

నిమజ్జనంకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎల్బీనగర్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, శానిటేషన్, లేక్స్, ఇంజనీరింగ్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎంటమాలజీ,తదితర విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.