Hyderabad: హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్య భాయ్ అలియాస్ ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి, ప్రముఖ పోలీసు అధికారుల పేర్లు వాడుకుంటూ భారీగా డబ్బులు వసూలు చేసి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు ఒక వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ సూర్య భాయ్ సదరు వ్యాపారిని నమ్మించాడు. ఒక కంటైనర్‌లో కిలోల కొద్దీ బంగారం వస్తోందని, కేవలం 50 లక్షల రూపాయలకే కిలో బంగారం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి, బంగారం కోసం విడతల వారీగా 32 లక్షల రూపాయలను సూర్య భాయ్‌కి అప్పగించాడు. తీరా డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు సూర్య భాయ్‌ని గట్టిగా నిలదీశాడు. దీంతో సూర్య భాయ్ అసలు రంగు బయటపెట్టి బాధితుడిని బెదిరించడం ప్రారంభించాడు. తనకు ముఖ్యమంత్రి, అలాగే సీఎం కుటుంబ సభ్యులు చాలా బాగా తెలుసని, సైబరాబాద్ మాజీ సీపీ సజ్జనార్ తన బిజినెస్‌లో పార్ట్‌నర్ అని అబద్ధాలు చెప్తూ వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేశాడు. వారి పేర్లు వాడుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..

Hyd
