Kishan Reddy : హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల కేంద్రంగా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం ఎంతో ఆనందకరమని అన్నారు.
బుధవారం బయో ఆసియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆవిష్కర్తలకు పురస్కారాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లైఫ్‌సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ రంగాల్లో భారత్ విశేష పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు.
ప్రపంచ ప్రజలకు సరసమైన ధరల్లో మందులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో భారతదేశం ప్రపంచ అవసరాల్లో 60% వ్యాక్సిన్లు, 20% జెనరిక్ మందులు సరఫరా చేస్తోందని వివరించారు. గత పది సంవత్సరాల్లో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెట్టింపు అయిందని, 2014లో 15 బిలియన్ డాలర్లు ఉన్న ఫార్మా ఎగుమతులు, 2024 నాటికి 27.85 బిలియన్ డాలర్లకు పెరిగాయని వెల్లడించారు.
భారతీయ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో స్థానానికి ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి వల్ల రక్షణ రంగం ఎగుమతుల్లో టాప్-25 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని అన్నారు. 2014లో ఒక్క మొబైల్‌ఫోన్ కూడా ఎగుమతి చేయలేని స్థితి నుంచి, ప్రస్తుతం రూ.1.28 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం అని తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ ఎకానమీగా ఎదుగుతుందనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు.
2014కి ముందు “ఫియర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (వ్యాపారం చేయాలన్న భయం) ఉండేదని, కానీ 2014 తర్వాత “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” దిశగా దేశం మార్పు చెందిందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి సంస్కరణల వల్ల సాధ్యమైందన్నారు.
అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం, భారత్‌లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కిషన్‌రెడ్డి వివరించారు. సంపద సృష్టిలో భాగంగా ఇటీవల బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచడం, భారత ఆర్థిక వ్యవస్థ బలపడటానికి దోహదం చేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ “బల్క్ డ్రగ్ క్యాపిటల్”గా, “వ్యాక్సిన్ క్యాపిటల్”గా ఎదుగుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 800కి పైగా ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి సంస్థలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్‌సైన్సెస్ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, “మెడ్‌టెక్ మిత్ర” వంటి ప్రాజెక్టులు ఆవిష్కర్తలకు, స్టార్టప్స్‌కు సహాయపడతాయని అన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు కలిసి భారత ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. “వసుధైవ కుటుంబకం” భావనకు ప్రతిబింబంగా భారత్ నిలుస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Solo Traveling: సోలో ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా? ఇవి పాటించండి..