అగ్ని ప్రమాదం సమాచారం అందగానే హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలను హైడ్రాకు చెందిన 5 డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మంటలు వ్యాప్తి చెందకుండా ఆపాయి. అమీర్‌పేట సారథీ స్టూడియో సమీపం, 5 అంతస్తుల దివ్యశక్తి అపార్టుమెంట్‌లోని రెండో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని టెక్నో స్క్రిప్ట్ క్రియేషన్స్ డబ్బింగ్ స్టూడియోలో అగ్ని ప్రమాదం ఏర్పడగా.. అందులో పని చేస్తున్న 25 ఏళ్ల రాజేష్ చౌదరిని హైడ్రా డీఆర్ ఎఫ్
బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఏసీ యూనిట్ కంప్రషర్ పేలడంతో మంటలు వ్యాపించి మధ్యాహ్నం 3.30 గంటలకు అగ్ని ప్రమాదం ఏర్పడింది.
READ MORE: Manchu Vishnu: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత మాయం చేశారు!
హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫోను రాగానే స్థానిక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మోహన్‌రావును అప్రమత్తం చేయగా.. తన వద్ద ఉన్న రెండు బృందాలతో కలిసి వెళ్లి మంటలు వ్యాప్తి చెందకుండా నిలువరించారు. ఈ లోగా.. జూబ్లీహిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడకు చేరుకున్నాయి. మంటల వ్యాప్తికి డబ్బింగ్ స్టూడియో సగానికి పైగా కాలిపోయి పొగలు కమ్మాయి. ఈ మంటలు పై అంతస్తులకు చేరకుండా పూర్తిగా ఆపేశారు. ఇదంతా గంటలో పూర్తి చేశారు. డబ్బింగ్ థియేటర్‌లో ఓనర్ కిషోర్‌తో పాటు.. అందులో పనిచేస్తున్న రాజేష్ చౌదరి ఉన్నారు. కిషోర్ అప్పటికే బయటకు రాగా.. స్టూడియోలో చిక్కుకున్న రాజేష్‌ను ల్యాడర్ ద్వారా పైకి వెళ్లిన డీఆర్ ఎఫ్ సభ్యుడు శ్రీకాంత్ చాకచక్యంగా కాపాడారు.
READ MORE: Hyderabad: స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ. 150 కోట్లు స్వాహా..!
రెండో అగ్ని ప్రమాదం..
కాగా.. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని పాటి గ్రామంలో అను ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం కూడా శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాతంలోనే జరిగింది. ఈ సమాచారాన్ని హైడ్రా కంట్రోల్ రూం నుంచి సమాచారం అందుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్‌రావు హుటాహుటిన 3 హైడ్రా బృందాలతో అక్కడకు చేరుకుని మంటల వ్యాప్తిని నిలువరించారు. ఫర్నీచర్ తయారీ కేంద్రంలో ఐరన్ ఫ్రేమ్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. నిప్పురవ్వలు ఫోమ్ మెటీరియల్‌పై పడి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న గోదాముకు కూడా వ్యాపించడంతో ఫర్నీచర్ మొత్తం మంటల్లో ఆహుతయ్యింది. భారీయెత్తున ఎగసి పడిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. జీ ప్లస్ 3గా ఉన్న ఈగోదాము భవనం చుట్టూ ప్రహరీ ఉండడంతో మంటలు వేరే భవనాలకు అంటుకునే ప్రమాదం కొంతవరకు తప్పింది. కూకట్‌పల్లి, మాధాపూర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలనార్పడంలో తోడ్పడ్డాయి. మాధాపూర్ బ్రాండో స్కై లిఫ్ట్ ద్వరా మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. గంటన్నరలో మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పినట్టు రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, ఎస్ ఎఫ్ వో సతీష్‌రావు చెప్పారు.