Hyderabad Drug Case: మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల కొడుకుల పాత్ర పైన ఈగల్ టీం విచారణ చేస్తోంది. మూడేళ్లుగా కొంత మంది పోలీసుల పుత్రరత్నాలు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది. అయితే 24 మంది ఉన్న ఈ హైప్రొఫైల్ డ్రగ్స్ పార్టీ కేసులో అసలు విషయాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. హైదరాబాద్ డ్రగ్ కేసు.. ఇప్పుడు కొంత మంది పోలీస్ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతోంది. వారి కొడుకులే డ్రగ్ దందా చేస్తున్నట్లు ఈగల్ టీమ్ విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు ఈ విషయం పోలీస్ డిపార్టుమెంట్‌ను షేక్ చేస్తోంది.
మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో సూర్య కీలక సూత్రధారుడిగా ఉన్నాడు. అయితే మిగతా 23 మంది పాత్రధారులే. వీళ్లంతా కూడా ఒకే కమ్యూనిటీకి చెందినవారు. అంతేకాదు వీళ్ల తల్లిదండ్రులు పెద్దపెద్ద మిలియనీర్స్.. కోట్ల కొద్ది వ్యాపారాలు చేస్తున్న వారే.. దానికి తోడు వీళ్లు గత ప్రభుత్వంలో అందరికీ బాగా దగ్గర ఉన్నవాళ్లే. వీళ్లంతా బాగా చదువుకున్న వాళ్లు.. ఇందులో డాక్టర్లు ఇంజనీర్లతో పాటు చాలామంది వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్లే ఉన్నారు. బయటి దేశాల్లో చదువుతున్న సమయంలో వీళ్లందరికీ డ్రగ్స్ వాడకం అలవాటైంది. అందరూ కూడా విదేశాలను వదిలిపెట్టి ఇండియాకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, పబ్బులను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఆయా వృత్తుల్లో సెటిల్ అయిపోయారు.
Chandu Naik Murder: సీపీఐ నాయకుడు చందూ నాయక్ వెలుగులోకి సంచలన విషయాలు..!
మల్నాడు కిచెన్స్ డ్రగ్స్ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్టు చేశారు. ఇందులో సూర్య కీలక సూత్రధారి అయితే.. హర్ష, రాహుల్, మోహన్, పవన్ డ్రగ్ పెడ్లర్స్‌గా ఉండిపోయారు. మొదటగా ఆరుగురిని మల్నాడు డ్రగ్స్ కేసులో ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఈ ఆరుగురిని కూడా నాలుగు రోజుల కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. మూడవరోజు కస్టడీలో నిందితులు కీలకమైన అంశాలను ఈగల్ టీంకి చెప్పారు. నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మల్నాడు డ్రగ్స్ దందాలో సీనియర్ పోలీస్ అధికారుల కుమారులు రాహుల్ తేజ్, మోహన్ కీలకంగా వ్యవహరించారు. నైజీరియన్ జెర్రీ దగ్గర ఏఆర్ డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్ డ్రగ్స్ కొనుగోలు చేసి సూర్యకు ఇచ్చినట్లు విచారణలో తెలిపారు. రాహుల్ తేజ్‌పై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ తేజ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు బయటపడింది. దీనికి తోడు సిద్దిపేట, వరంగల్, మోయినాబాద్, చిలుకూరు ప్రాంతాల్లోని రిసార్టులు, ఫామ్ హౌస్‌లో కూడా వీళ్లు డ్రగ్ పార్టీలు చేశారు. డ్రగ్స్ అమ్మకాలు జరపకపోయినా ఐదుగురు నైజీరియన్స్ నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించుకునేవారు. ఒకసారి సూర్య డ్రగ్స్ తెప్పిస్తే.. అతను ఏదో ఒక ఫామ్ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్‌ను అందరికీ ఇచ్చి సేవించేవారు.
అదేవిధంగా రాహుల్ మరొకసారి డ్రగ్స్ తెప్పించి మిగతా వాళ్లందరికీ పార్టీలు ఇచ్చేవారు. ఇలా వారంలో మూడు రోజులపాటు ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు డ్రగ్స్ తెప్పించుకొని పార్టీలు చేసుకునేవారు. ఇప్పటివరకు ఈగల్ టీం గుర్తించిన వాటిలో హైదరాబాద్, మొయినాబాద్, చిలుకూరు, సిద్దిపేట్, కరీంనగర్ ప్రాంతాలలోని ఫామ్ హౌస్ లో రిసార్టుల్లో వీళ్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ డ్రగ్ పార్టీలు అక్కడికే పరిమితమైనాయా? లేక రేవ్ పార్టీలుగా చేసుకున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Real Estate Scam: వెలుగులోకి మరో రియల్ ఎస్టేట్ మోసం.. ఈసారి ఎంతమంది బాధితులంటే..?
24 మందిలో బడా బాబుల పిల్లల డాటా మొత్తం ఇప్పుడు ఈగల్ టీం వద్దకు చేరుకుంది. గతంలో డ్రగ్స్ కేసులో వీళ్ల పేర్లు వచ్చినప్పటికీ అప్పటి పోలీసు అధికారులు వీళ్లని అరెస్టు చేయలేదు. అంతేకాకుండా వీళ్ల పేర్లను కూడా చేర్చలేదు. అయితే కొన్ని కారణాల వల్ల డిచ్‌పల్లి డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ పేరు మాత్రం జోడించారు. అప్పుడు కూడా రాహుల్ తేజ పరారీలో ఉన్నట్టే చూపెట్టారు. మరోవైపు రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2024 జనవరిలో డిచ్‌పల్లిలో రాహుల్ తేజ్‌పై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది. ఆ కేసులో విచారించేందుకు డిచ్‌పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్‌లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్‌ను రాహుల్ తేజ్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు విచారణలో బయటపడింది.
రాహుల్ యూకేలో డాక్టర్ చదివాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. యూకేలో ఉన్న సమయంలోనే అతనికి కొకైన్ తీసుకోవడం అలవాటయింది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రెండ్స్ అయిన సూర్య హర్షలకు ఇదే విషయం చెప్పాడు. దీంతో తమకున్న పరిచయాలతో సూర్య, హర్ష కలిసి రాహుల్ కి డ్రగ్స్ తెప్పించి ఇచ్చేవాళ్లు. అంతేకాకుండా విదేశాల్లో కు టూరిస్ట్ పేరుతో వెళ్లి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకునేవారని బయటపడింది. సూర్య అండ్ టీం ఇచ్చిన డ్రగ్ పార్టీలకు ఎవరెవరు? ఎక్కడ? ఎప్పుడు? ఏ విధంగా? హాజరు అయ్యారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈగల్ టీమ్ ప్రయత్నం చేసింది. ఈ డ్రగ్ పార్టీలో పాలుపంచుకున్న వారందరినీ పిలిచి విచారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది.