NTV Telugu Site icon

Fraud: ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు ఇస్తే కమీషన్‌..! బ్యాంకు నోటీసులు చూసి షాక్‌

Fraud

Fraud

Fraud: రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మోసాలు ఓవైపు.. సైబర్ నేరాలు మరోవైపు.. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మి ఏదైనా చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.. తాజాగా, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు ఇస్తే కమిషన్ ఇస్తానంటూ ఎరవేసి వారి పేరుపై కోట్ల రూపాయల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పేద ప్రజలను నిలువునా ముంచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. తమ పేరుపై ఉన్న లక్షలాది రూపాయలు అప్పులు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో మోసపోయామని గుర్తించి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు బాధితులు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం సోనోవిజన్ లో పనిచేసే రత్నాకర్ అనే వ్యక్తి అమాయకులను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. పేద ప్రజల నుండి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనిపించిన సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్ వారికి వస్తువులు ఇవ్వకుండా కమిషన్ రూపంలో కొంత నగదు చేతిలో పెట్టేవాడు. ఒకరికి తెలీకుండా మరొకరి దగ్గర ఇలా వందలమంది పేరుతో వస్తువులు కొనుగోలు చేసిన రత్నాకర్ వాటిని బయట అమ్ముకుని సొమ్ము కూడబెట్టుకున్నాడు. తమ బ్యాంకు వివరాలు ఇచ్చి కమిషన్ తీసుకున్న వారికి అనుమానం రాకుండా మొదటి ఈఎంఐ చెల్లించేవాడు. ఇలా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది మంది నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడిన రత్నాకర్ తర్వాతి కాలంలో వాయిదాలు చెల్లించడం మానేశాడు. వాయిదాలు చెల్లించాలంటూ ఆధార్ పాన్ కార్డులు ఇచ్చిన వ్యక్తులకు మెసేజ్‌లు వెళ్లడంతో మోసం పోయామని గుర్తించిన బాధితులకు తర్వాత కాలంలో ఫైనాన్స్ ఉద్యోగుల వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేక అత్తిలి చెందిన బాధితులు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సోనోవిజన్ ఉద్యోగి రత్నాకర్ చేసిన మోసాలపై అత్తిలి పోలీస్ స్టేషన్ లో జీరో FIR నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘరానా మోసానికి పాల్పడిన రత్నకరపై సోనోవిజన్ సంస్థ సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.