ఆసియా క్రీడల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్.. ఇవాళ్టితో ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. అయితే గతంతో పోలిస్తే.. 2023 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 107 పతకాలు సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాల మార్కును దాటింది. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
Read Also: Hyderabad: నెహ్రూ జూ పార్క్‌లో ఏనుగు దాడిలో కేర్ టేకర్ మృతి
ఆసియా క్రీడల తొలిరోజునే భారత ఆటగాళ్లు 5 పతకాలు సాధించి శుభారంభం చేశారు. రెండో రోజు కూడా భారత్ 6 పతకాలు సాధించింది. కాగా మూడు, నాలుగు, ఐదో రోజుల్లో భారత్ వరుసగా 3, 8, 3 పతకాలను కైవసం చేసుకుంది. భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరు ఇక్కడితో ఆగలేదు. ఆరో, ఏడో, ఎనిమిది, తొమ్మిదో రోజుల్లో భారత్ వరుసగా 8, 5, 15, 7 పతకాలు సాధించింది. పదో, పదకొండో, పన్నెండు, పదమూడో, పద్నాలుగో రోజుల్లో భారత ఆటగాళ్లు వరుసగా 9, 12, 5, 9, 12 పతకాలు సాధించారు.
Read Also: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోర్లు ఇవే..
ఇంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలు 2018లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అందులో భారత్ 70 పతకాలు సాధించింది. అయితే ఇప్పుడు భారత ఆటగాళ్లు తమ పాత రికార్డులను చెరిపేశారు. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు 2023లో చైనా ఆధిపత్యం కనిపించింది. చైనా 194 స్వర్ణాలు సహా 368 పతకాలు సాధించింది. ఆ తర్వాత జపాన్ 48 స్వర్ణాలు సహా 177 పతకాలు సాధించింది. దక్షిణ కొరియా 39 బంగారు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. కాగా భారత్ నాలుగో స్థానంలో ఉంది.