Coach Jai Simha React on His Suspension: హెడ్ కోచ్ జై సింహా తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. బస్సులో తమ ముందే మద్యం సేవించాడని, అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేధింపుల ఆరోపణలపై కోచ్ జై సింహా స్పందించాడు. తానూ ఏ తప్పు చేయలేదని, ఎలాంటి విచారణ చేయకుండా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశనించారు.
హెడ్ కోచ్ జై సింహా ఎన్టీవీతో ఫోన్‌లో మాట్లాడాడు. ‘నేను మద్యం సేవించలేదు. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను. నేను ఎవరినీ వేధించలేదు. హెచ్‌సీఏ నన్ను సస్పెండ్ చేసింది. ఎలాంటి విచారణ చేయకుండా నాపై ఎలా చర్యలు తీసుకుంటారు’ అని జై సింహా ప్రశ్నించాడు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు జగన్మోహన్ రావు తెలిపారు.
Also Read: Ooru Peru Bhairavakona Review: సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ రివ్యూ!
విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో హెడ్ కోచ్ జై సింహా.. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడు. దాంతో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహార శైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమ రావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో.. హెచ్‌సీఏ చర్యలకు దిగింది.