NTV Telugu Site icon

Home Minister Anitha: సైబర్ నేరాలు అరికట్టేలా ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్..

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు. ప్రతీ పోలీసు స్టేషన్ వద్ద కనీసం 6 సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దీనికి సంబంధించిన నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అలాగే నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రతలు తీసుకోలేదన్నారు.

Read Also: AP CM Chandrababu: నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..

ఏపీలో 15 వేల సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పని చేస్తున్నాయన్నది తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలు, మహిళా కళాశాలలు, మెడికల్ కళాశాలలు, బస్టాండు, రైల్వే స్టేషన్లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం చెప్పారన్నారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాను గుర్తించి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని స్పష్టం చేశారు. గంజాయి నియంత్రణకు రాష్ట్ర వ్యాప్త ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పాఠశాల, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిందని.. సైబర్ నేరాలు అరికట్టేలా ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read Also: CM Chandrababu: కన్నయ్యనాయుడిని సన్మానించిన సీఎం చంద్రబాబు

విజయవాడలో పోలీసు అకాడమీకి కూడా ప్రతిపాదనలు చేశామన్నారు. విశాఖలో గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పోలీసులకు ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు కూడా చెల్లించాలని నిర్ణయం జరిగిందన్నారు. 2019లో ఎక్కడ అయితే ఆపామో.. ఇప్పుడు 2024లో అక్కడ మొదలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిపై కక్షతో ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా గత ప్రభుత్వం పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గతంలో పొరుగు రాష్ట్రాలపై ఫోరెన్సిక్ నివేదికల కోసం ఆధారపడాల్సి వచ్చిందన్నారు. తక్షణం ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం కోసం సీఎం అనుమతిచ్చారని మంత్రి అనిత వెల్లడించారు. జగన్, జగన్ కుటుంబ భద్రతపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీఎంగా ఉన్నప్పుడు తన భద్రత కోసం 980 మందిని నియమించుకున్నారని విమర్శించారు. భద్రత కోసమే నెలకు రూ. 6 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. జగనుకు ఇప్పటికీ జెడ్ ప్లస్ సెక్యూరిటీనే కొనసాగుతోందన్నారు. జగన్ తల్లి విజయమ్మకు, ఆయన సతీమణి భారతికి జగన్ సీఎంగా ఉండగా 1+1 మాత్రమే భద్రత ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం మా ప్రభుత్వం వారికి 2+2 భద్రత కల్పిస్తోందన్నారు. జగన్ సీఎంగా ఉండగా భువనేశ్వరి, బ్రాహ్మణికి భద్రత తొలగించారని తెలిపారు. 36 రాజకీయ హత్యలు జరిగాయన్న ఆరోపణలకు జగన్.. ఇప్పటికీ ఆధారాలు ఇవ్వలేదన్నారు.