Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు. టీడీపీ దౌర్జన్యాలను హింసకాండను తక్షణమే అడ్డుకోవడంలో విఫలమైతే.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
Read Also: Andhra Pradesh Election 2024: సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఏపీ ఎలెక్షన్స్.. ప్రతి సీనూ క్లైమాక్సే!
దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు. ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ తీరుతో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని బాధ్యతారాహితంగా ఎక్కడికక్కడ చేసిన బదిలీల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని హోంమంత్రి వనిత డీజీపీకి వివరించారు. పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు హింసకు పాల్పడుతుంటే స్థానిక పోలీసులు పట్టనట్లు ఉన్నారని, వారంతా నిబంధనల ప్రకారం వ్యవహరించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దౌర్జన్యకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను హోం మంత్రి తానేటి వనిత కోరారు.