Site icon NTV Telugu

Kottu Satyanarayana : హిందూ మతం బీజేపీ సొత్తు కాదు… పేటెంట్ హక్కు లేదు

Kottu Satyanarayana

Kottu Satyanarayana

బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. హిందూ మతాన్ని హిందూ దేవుళ్లను రాజకీయంగా వాడుకోవడం బీజేపీకి ఒక క్రీడలాగా మారిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. హిందూ మతం మీద దేవుళ్ళ మీద వీరికి పేటెంట్ హక్కు ఏమీ లేదన్నారు..వారికి ఎవరు ఇవ్వలేదన్నారు. మతానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్న దుర్మార్గ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా శివరాత్రి మహోత్సవాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో ట్విట్టర్లో సదుద్దేశంతో వచ్చిన ఒక చిన్న క్యారికేచర్ను పట్టుకుని వక్ర భాష్యాలు వల్లిస్తూ రెచ్చిపోవడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ దేవుళ్ళు రాముడు శివుడిని వాడుకుని వదిలేసే ఈ బీజేపీని, ఆ పార్టీ నేతలను ఏమి చేయాలో ఆ భగవంతుడే చూసుకుంటాడన్నారు. దేవుళ్ళు విషయంలో అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని చెప్పేవారు అది వీళ్లకు కూడా వర్తిస్తుందన్నారు. రాష్ట్రమంతా శివనామస్మరణతో శివమయమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందనే విషయాన్ని కూడా వదిలేసి రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న అల్లరి శివుడికి చేస్తున్న మహా అపచారంగా ఆయన అభివర్ణించారు.

Read Also: Taraka Ratna: అలా కోదండ రామిరెడ్డి చేతికి వెళ్లిన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’

రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీతో అంట కాగినప్పుడు మీ పార్టీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా 40 గుళ్ళు కూల్చిన ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేదు. మీరంతా అప్పుడు ఏమి చేస్తున్నారు ఎక్కడ నిద్రపోతున్నారని విమర్శించారు. మీరు కూలిస్తే మేము ఆ దేవాలయాలను పునర్నిర్మించామని చెప్పారు. ఇప్పటికీ వైఎస్ఆర్సిపి మీద ద్వేషంతో రాజకీయంగా ఎదుర్కోలేక రథాలు తగలబెట్టించి విగ్రహాల కాళ్లు చేతులు విరగ్గొట్టి ఆ బురదంత వైసీపీపై చల్లాలని కుట్రలు కుతంత్రాలు చేసింది మీరు కాదా అంటూ విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి హిందూ మతం మీద మతసామరస్యం మీద ఎంతో గౌరవం ఉన్నత భావాలు ఉన్నాయన్నారు. ఆయన ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో తాను నిర్వహిస్తున్న దేవదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల పునర్వైభవానికి హిందూ మత పరిరక్షణకు సంస్కృతిని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సహేతుక విమర్శలు చేయండి. సలహాలు ఇవ్వండి అంతేతప్ప మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మినట్లు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.

Read Also: Electric Shock: క్రికెట్ ఆడుతూ బాల్ కోసం వెళ్లిన బాలుడు….

Exit mobile version