రాష్ట్రంలో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ లో నమోదయ్యాయి. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన వడ గాలులతో ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల జిల్లా భీమారం లో 47.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కుంచ వెల్లి లో 46.6, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ దరిలో 45.2, నిర్మల్ జిల్లా బుట్టాపూర్ లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. జనాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
READ MORE: Tenth Pass: పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు..
మరోవైపు వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో కేరళ అల్లాడిపోతోంది. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జూన్ 5 నాటికి కర్ణాటక, ఏపీ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు, జూన్ 10 నాటికి మహారాష్ట్ర, తెలంగాణ, ఎగువ ఏపీ, పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంటుందని IMD తెలిపింది. నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.