NTV Telugu Site icon

Relief For Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్

Maxresdefault (1)

Maxresdefault (1)

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. వైఎస్​ అవినాష్​ రెడ్డి (Mp AvinashReddy) ముందస్తు బెయిల్​ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ కి ముందస్తు బెయిల్​ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇదిలావుండగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవినాష్ ని విచారిస్తామన్న సీబీఐ విచారణ రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్​ రెడ్డిని విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

Read Also: BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 వరకు ప్రతి రోజూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది. అవినాష్‌ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. ఈనెల 25న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిని సీబీఐ కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వాళ్ళిద్దరితో కలిపి అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

Viveka Case : 25వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశం l NTV

ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌పై ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తులో గూగుల్‌ టేకవుట్‌ డేటాపై ఆధారపడటం తగదు. సునీల్‌ యాదవ్‌ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్‌ డేటా విరుద్ధంగా ఉన్నాయి. దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్‌ డేటా తప్పా? కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. బంధువు కాబట్టి హత్యా స్థలికి వెంటనే వెళ్లాం. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదు’’ అని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారని అవినాష్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. అవినాష్‌రెడ్డి, సునీత, సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ముందస్తు బెయిల్ పై ఏర్పడిన ఉత్కంఠ వీడిపోయింది.

Read Also: AP CS Jawahar Reddy: విభజన అంశాలపై రేపు ఢిల్లీలో భేటీ