ATM Cash Van Robbery Case: ఈ నెల 19న బెంగళూరు..సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ…. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం ఆఫీసుకు రావాలని నగదుతో ఉన్న వ్యాన్‌ను….ఆ వాహన డ్రైవర్‌తోనే డెయిరీ కూడలి వంతెనపైకి తీసుకెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి.. తమ వద్ద ఉన్న పిస్టల్, కత్తులతో బెదిరించారు. వ్యాన్‌లోని ఏడున్నర కోట్ల నగదును, తమ కారులోకి మార్చుకున్నారు. ఆ తర్వాత ఉడాయించారు. చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పరారయ్యారు.
Read Also: Maoists: భారీ దెబ్బ..! తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మావోయిస్టులు.. ఏకంగా 38 మంది!
ఈ భారీ దోపిడీపై బెంగళూరులోని సిద్ధాపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ దోపిడీ కేసులో ఏపీ లింకులు ఉన్నాయని, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఈ చోరీలో పాల్గొన్నారని అనుమానించిన కర్నాటక పోలీసులు..ఆ దిశగానే దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరులో పలు రకాల ఆరోపణలతో సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్ డైరెక్షన్‌లో ఈ దోపిడీ జరిగిందని నిర్ధారించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు…కుప్పానికి చెందిన మరికొందరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో మూడు రోజుల పాటు గాలించిన కర్నాటక, చిత్తూరు పోలీసులకు…దొంగల ముఠా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కొట్టేసిన కోట్ల రూపాయల నగదు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండేసరికి.. ఆ నగదును ఎక్కడ దాచాలో తెలియక పలు ప్రాంతాలకు మారుస్తున్న సమయంలోనే దొరికిపోయారు దొపిడీ దొంగలు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. ఐదు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా… అవల్లహళ్లి ప్రాంతంలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది. UP 14 BX 2500 నెంబర్ ఉన్న ఇన్నోవా వాహనంలో నగదును తరలించిన దుండగులు, ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చి వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. గుడిపాల మీదుగా చిత్తపార గ్రామానికి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో ఈ భారీ రాబరీ కేసులో చిత్తపార, ఆ సమీప గ్రామాల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించారు. ఈ అనుమానంతోనే కర్ణాటక పోలీసులు చిత్తూరు జిల్లా పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేపట్టారు. అప్పటికే ఓ ఇంట్లో రహస్య ప్రదేశంలో నగదును దాచిపెట్టారు నిందితులు. రెండు రోజుల పాటు నగదును పలు ప్రాంతాలకు మార్చిన దొంగలు..చివరికి నవీన్ అనే యువకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును ఉంచారు. నవీన్ ఇంట్లో ఏడున్నర కోట్ల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.