Site icon NTV Telugu

Ayodhya Ram Temple: అయోధ్యకు భారీగా తరలిన భక్తులు.. తోపులాట

Ayodhya

Ayodhya

Ram Mandir: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. ఇక, తొలి రోజు రామ్‌లల్లాను దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహంతో కిటకిటలాడుతుంది. రాముడి దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య నగరం మార్మోగిపోతుంది. కాగా, అయోధ్య రామమందిరంలో తోపులాటలు కూడా జరిగినట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: Glenn Maxwell: పూటుగా తాగి ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్‌.. దర్యాప్తుకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా!

కాగా, తొలి రోజు అయోధ్య రామాలయాన్ని దాదాపు 5 లక్షల మంది భక్తులు సందర్శించుకునే అవకాశం ఉందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు అంచనా వేసింది. సామాన్య భక్తులకు నేటి నుంచి దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా రామ భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని పేర్కొన్నారు. ఆలయంలో రెండుసార్లు హారతిని భక్తులు దర్శించుకోవచ్చు అని తెలిపారు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు వెల్లడించింది.

Exit mobile version