ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
READ MORE: India Pakistan War: మధ్య ఆసియా దేశం నుంచి భారత్ దాడి చేసే ఛాన్సుందా..? పాకిస్తాన్‌లో కొత్త భయం..
విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయట. ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని స్పష్టం చేశారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..