NTV Telugu Site icon

Heavy Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన

Heavy Rain

Heavy Rain

Heavy Rain: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అరగంటలో అత్యధికంగా 5 సెంటిమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. యూసఫ్‌గూడ లో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 4.8, ఆదర్శ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్ గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో కూడా 4 సెంటి మీటర్ల లోపు వర్షం కురిసింది. మరోవైపు.. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

Read Also: Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వాన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యం లో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.