Site icon NTV Telugu

Heavy Rains: పలు రాష్ట్రాల్లో వరుణ బీభత్సం.. గుజరాత్, మహారాష్ట్రలో కుండపోత

Heavy Rains In India

Heavy Rains In India

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల నదులపై వరదనీరు పారుతుండడతో రాకపోకలకు అంతరాయంగా ఏర్పడుతోంది. గుజరాత్, మహారాష్ట్ర రాష్టాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, 8 గ్రామాలకు రహదారి కనెక్టివిటీని ప్రభావితం చేసే కొన్ని నదుల్లో వరదలు సంభవించాయని అధికారులు మంగళవారం తెలిపారు. పాల్‌ఘర్‌లోని జవహర్ తాలూకాలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్థానిక రెవెన్యూ అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా తాలూకాలో ఏడు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం పాల్‌ఘర్‌కు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా పాలనాధికారి తెలిపారు.

ముంబయికి గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడింది. అలాగే పలు ప్రాంతాల్లో రానున్న కొద్ది గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకూ 5,873 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Kaleshwaram Project : నిండుకుండలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌

గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం సహా పలు ఘటనల్లో మొత్తంగా 64 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్‌లోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. జులై 15 నాటికి వర్షపాతం తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి అంచనా వేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరదలు రావడంతో అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్‌కు సోమవారం హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులను కూడా హోం మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలను పరిష్కరించడానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. గత 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా దక్షిణ, మధ్య గుజరాత్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాటి ప్రభావంతో తలెత్తిన పరిస్థితులపై గుజరాత్ ముఖ్యమంత్రి పూర్తి వివరాలను ప్రధానికి వివరించారు. గుజరాత్‌లోని పలు గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు అధికారులు హెలికాప్టర్లను మోహరించారు. వరదల కారణంగా ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి 2000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత మందిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడొచ్చని విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ వెల్లడించింది.

Exit mobile version