NTV Telugu Site icon

Heat Wave Alert: ఈ నాలుగు రోజులు మండే ఎండలు.. ఐఎండీ వార్నింగ్

Heat Wave

Heat Wave

Heat Wave Alert: తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్​ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మొదటి రెండ్రోజులు రాష్ట్రంలోని సగం జిల్లాల్లోనే ప్రభావం ఉంటుందని అందులో పేర్కొంది.

ఆ తర్వాతి రెండ్రోజులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 రోజులు 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. ఆ తర్వాత వాతావరణం చల్లబడుతుందని, మళ్లీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read Also: Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్

నల్గొండ జిల్లా పెద్దఅడిశెర్లపల్లి మండలం ఘనపూర్‌లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌​లో 41.7, ఆసిఫాబాద్‌లోని ​జంబుగ, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 41.6, నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో 41.5, నిజామాబాద్ నార్త్‌లో ​41.4, పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లి, భద్రాద్రి జిల్లా నాయుడుపేటలో 41.3, వికారాబాద్‌ జిల్లా నాగారంలో 41.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.