NTV Telugu Site icon

Bhatti Vikramarka : తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : హెచ్‌సీయూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు లు ప్రొఫెసర్ హరగోపాల్.. ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో కేసు గెలిచామన్నారు. ప్రయివేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా వేల కోట్ల భూమిని కాపాడామని, ప్రజల ఆస్తిని కాపాడిన తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రయివేటు రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మేము తాపత్రయపడుతున్నామని, పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. మేము చేసే ప్రతి పని సంపద ఎలా సృష్టించాలనే అని ఆయన తెలిపారు. ఇవి యూనివర్సిటీ భూములు కాదని, HCU కి సంబంధించిన ఇంచు భూమిని మేము తీసుకోమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉందని, HCU భూముల్ని ప్రభుత్వం గుంజుకుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు భట్టి విక్రమార్క.

కొన్ని రాజకీయ పార్టీలు అబద్దాల మీద బతుకుతున్నాయని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. 13-01-2004 వరకూ ఈ భూములు యూనివర్సిటీవే అనుకున్నారని, ఆ తర్వాత ఈ భూముల్ని ఐఎంజీ భారత్‌కు అప్పగించారన్నారు. 400 ఎకరాలకు బదులుగా.. పక్కనే ఉన్న గోపనపల్లిలో 397 ఎకరాలు ప్రభుత్వం HCUకి కేటాయించిందని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు భట్టి విక్రమార్క. అధికారులు, యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఇందులో సంతకాలు పెట్టారన్నారు. వేల కోట్ల విలువైన భూమి ఇది అని, గత ఒప్పందాలు తెలియనివాళ్లే.. భూములపై రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో ఉండాలని గత పాలకులు కోరుకున్నారని, ఆ తర్వాత తాము లబ్ది పొందవచ్చని కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కానీ ఈ భూములు ప్రభుత్వానికే దక్కాలని కాంగ్రెస్‌ సర్కార్‌ పోరాటం చేసిందన్నారు భట్టి విక్రమార్క.

Harish Rao : రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు