HCA Pays Pending Power Bill to TSSPDCL: దాదాపు 10 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)తో నడుస్తున్న పవర్ బిల్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. మంగళవారం రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు చెక్ రూపంలో అందించారు. దాంతో 2015లో మొదలైన విద్యుత్ బిల్ వివాదానికి తెరపడింది.
ఉప్పల్ స్టేడియంకు సంబంధించి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు హెచ్‌సీఏ రూ.1 కోటి 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ 2024 సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా.. ఉప్పల్ స్టేడియంలో కరెంట్ తీసేశారు. పలు చర్చల అనంతరం విద్యుత్‌ను సరఫరా చేశారు. ఐపీఎల్ 17వ సీజన్ సమయంలో తొలుత రూ.15 లక్షలును హెచ్‌సీఏ చెల్లించింది. ఇప్పుడు మిగతా మొత్తాన్ని చెల్లింది.
Also Read: Gold Rate Today: స్థిరంగా పసిడి ధరలు.. తగ్గిన వెండి!
‘2015 నుంచి సుమారు రూ.1 కోటి 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉంది. ఐపీఎల్ 2024 సమయంలో రూ.15 లక్షలు చెల్లించాం. మిగిలిన మొత్తాన్ని 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నాం. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి చెల్లించాం’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు చెప్పారు. ఐపీఎల్ 2024 సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి.. హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీని జగన్‌మోహన్ రావు కోరారని తెలుస్తోంది.