నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక వాసన ఉండదు, తక్కువ సమయంలోనే ‘కిక్’ ఎక్కువగా ఉంటుందని వినియోగదారులు చెబుతారు. దీంతో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మేజర్ నగరాల్లో దీని డిమాండ్ భారీగా పెరిగింది.
స్మగ్లర్లు 10 గ్రాముల చిన్న బాటిళ్లలో హాష్ ఆయిల్‌ను బహిరంగంగా సరఫరా చేస్తున్నారు. పార్టీలు, రిసార్ట్‌లు, ప్రైవేట్ ఈవెంట్లకు వీటి డిమాండ్ పెరుగుతోంది. పాకెట్‌లో వేసుకుని తేలికగా తరలించే వీలుండటంతో గంజాయి మాఫియా దీనివైపు మొగ్గుచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పంగి కేశవరావు అలియాస్ కేశవ్. ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా కిన్నెరలోయకు చెందినవాడు. గతంలో డ్రగ్స్ కేసులో అనకాపల్లి పోలీసులకు చిక్కిన ఇతను ఇప్పుడు మళ్లీ అదే రూట్లోకి వెళ్లాడు. ఇతని స్నేహితుడు ఆర్టీఏ ఏజెంట్ కృష్ణతో కలిసి ఏపీ నుంచి హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి బృందాలు పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 20 కిలోల హాష్ ఆయిల్ బయటపడింది. ఇప్పటికే కేశవ్, జయరాంలను అరెస్ట్ చేసిన పోలీసులు, బెంగుళూరు నుంచి వచ్చే పార్టీల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పట్టుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్టీఏ ఏజెంట్ కృష్ణ కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి, హాష్ ఆయిల్ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో పార్టీలు, ఈవెంట్‌లు జరిగే ప్రాంతాల్లో నిఘా బలపడనుంది.